శ్రీమద్వాల్మీకి రామాయణము

బాలకాండ - డెబ్బదిమూడవ సర్గ

సీతా కల్యాణము !!

||om tat sat ||


ఇయం సీతా మమసుతా సహధర్మచరీ తవ |
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణీనా ||

"నా కుమార్తె యగు ఈ సీత నీ సహధర్మచారిణిగా స్వీకరింపుము . నీకు శుభమగుగాక .(ఆమే) చేతిని (నీ) చేతిలో తీసుకొనుము".

 

బాలకాండ
త్రిసప్తతితమస్సర్గః
( సీతా రామ కల్యాణము)

దశరథ మహరాజు మిథిలానగరములో రామలక్ష్మణభరత శతృఘ్నుల కల్యాణ సందర్భములో ఉత్తమమైన గోదానము చేసిన దినమే శూరుడైన యుధాజిత్తు అచటికి వచ్చెను.

అతడు కేకేయరాజపుత్త్రుడు. సాక్షాత్తు భరతుని మేమమామ . రాజుని చూచి కుశలములు అడిగి ఇట్లు పలికెను. "ఓ రాజా ! కేకాయాధిపతి మీ కుశలములగురించి అడిగెను. ఏవరి కుశలములపై మీకు ప్రేమో వారందరూ కుశలమే . ఓ రఘునందన ఓ రాజేంద్ర ! నా మేనల్లుడుని చూడకోరితిని. అందుకు అయోధ్యానగరము పంపబడితిని. ఓ రాజా మీరు మీపుత్రుల వివాహనిమిత్తమై అయోధ్యానగరము నుంచి మిథిలానగరము వచ్చితిరని విని నామేనల్లుని చూడ కోరికతో నేను త్వరగా ఇచటికి వచ్చితిని".

అప్పుడు దశరథ మహారాజు ఉపస్థితుడైన ప్రియమైన అతిథిని చూచి పూజార్హుడైన అతనిని చక్కగా పూజించెను. పిమ్మట పుత్త్రులు మహాత్ములతో కూడి దశరథమహారాజు ఆ రాత్రి సంతోషముతో గడిపెను. ప్రభాత సమయమున మళ్ళీ లేచి చేయవలసిన కర్మలను చేసి అప్పుడు ఋషులను తో కలిసి యజ్ఞవాటికకు చేరెను.

అప్పుడు తగిన శుభమైన ముహూర్తములో సర్వాభరణభూషితుడైన రాముడు సోదరులతో కూడి చేయవలసి మంగళకార్యక్రమములను చేసి వసిష్ఠుడు తదితర ఋషులతో కలిసి తండ్రిని సమీపించి అచట నిలబడెను.

అప్పుడు భగవాన్ వసిష్ఠ మహాముని జనకునితో ఇట్లనెను. "ఓ రాజన్ ! దశరథ మహారాజు నరవరులలో శ్రేష్ఠులైన తనపుత్రులతో చేయవలిసిన కౌతుక కర్మలను కావించి కన్యాదాతవైన నీ కొరకు ఎదురుచూచున్నాడు. దానము ఇఛ్చువాడు దానిని పరిగ్రహించువాడు ద్వారానే అన్నికార్యక్రమములు అగును కదా ! ఉత్తమమైన రామలక్ష్మణభరతశతృఘ్నుల వివాహము జరిపించి నీ ధర్మమును అనుసరించుము".

ఆ విథముగా పరమ ఉదారుడైన మహాత్ముడగు వసిష్ఠుని చే చెప్పబడిన మహాతేజోవంతుడు పరమ ధర్మజ్ఞుడు అయిన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను. "ఇది మీ రాజ్యమేనని భావింపుడు . మిమ్ములను అడ్డగించువారు ఏక్కడ ? ఎవరి ఆజ్ఞకు ఎదురు చూచుచున్నారు? స్వగృహమున సంకోచమెందుకు. ఓ మునిశ్రేష్ఠ ! నా పుత్రికలు చేయవలసిన కౌతుక కర్మలను చేసి వెలుగుచున్న అగ్నిజ్వాలలవలె తేజరిల్లుచూ వేదిక కడ ఉన్నారు. నేను సర్వసన్నధుడనై ఆ వేదిక వద్ద మీ కొఅకు ప్రతీంక్షుచున్నాను. ఓ రాజా విఘ్నము లేకుండా చేయుదురుగాక. జాప్యము చేయవలదు".

అప్పుడు దశరథుడు జనకునిచే చెప్పబడిన ఆ మాటలను విని తన పుత్రులందరితో ఋషిగణములతో ప్రవేశించెను.

అప్పుడు విదేహ రాజు వసిష్ఠునితో ఇట్లనెను. "ఓ ధార్మిక ! ఋషులతో కూడి లోకరాముని కల్యాణముకు సర్వకార్యములు చేయుడు. ఓ విభో ! రామునియొక్క వైవాహిక క్రియను జరిపింపుడు".

జనకునితో అట్లేనని చెప్పి ఋషి భగవాన్ వసిష్ఠుడు ధార్మికుడైన విశ్వామిత్రుని తో శతానందునితో కలిసి యథావిథిగా వేదికను మండపు మధ్యలో చేసి ఆ వేదికను గంధపుష్పములతో అలంకరించెను. ఆ వేదిక సువర్ణ పాత్రలతో , అంకురములతో కూడిన చిల్లులు కల కడవలతోనూ, మొలకులతో ఒప్పుచున్న మూకుళ్ళతో , ధూపముతో కూడిన ధూపపాత్రలతో నిండియున్నది. శంఖపాత్రలతోనూ స్రుక్సువములతోనూ అర్ఘ్యజలముతో నిండిన పాత్రలతోనూ పేలాలతో కూడిన పాత్రలతో, అక్షతలతో కూడిన పాత్రలతో వివాహ వేదికను సిద్ధము చేసిరి.

మంత్రపూర్వకమైన సమానమైన దర్భలతో విధివశముగా వేదికను అలంకరించి, మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకు వచ్చి, మహాతేజోవంతుడైన భగవాన్ వసిష్ఠుడు అగ్నిని వెలిగించెను.

శ్రీ సీతాకల్యాణ మహోత్సవ ఘట్టము.

అప్పుడు ఆన్ని ఆభరణములతో అలంకరింపబడిన సీతను తీసుకు వచ్చి అగ్నికి ఏదురుగా , రాముని ఎదురుకుండా కూర్చునబెట్టి ఆ జనక మహారాజు కౌసల్యా నందవర్ధనునితో ఇట్లు పలికెను. నా కుమార్తె యగు ఈ సీత నీ సహధర్మచారిణిగా స్వీకరింపుము . నీకు శుభమగుగాక. ఆమె చేతిని నీ చేతిలో తీసుకొని పాణిగ్రహణము చేయుము. సీత సర్వసౌభాగ్యవతి అయిన పతివ్రత. ఎల్లప్పుడు నీకు నీడవలె అనుసరించును" అని పలికి మంత్రపూరితమైన జలమునువారిపై ప్రక్షాలించెను.అప్పుడు దేవతలూ ఋషులు అప్పుడు "బాగు బాగు" అని పలికిరి. దేవదుందుభులు మ్రోగెను. మహత్తరమైన పుష్పవృష్ఠి కురిశెను.

మంత్రోదకములతో సీతను ఇచ్చిన జనక మహారాజు హర్షముతో పొంగిపోవుచూ మరల ఇట్లు పలికెను. "లక్ష్మణా రమ్ము. నీకు శుభమగుగాక. నేను ఊర్మిళను ఇచ్చెదను. స్వీకరించుము . పాణిగ్రహణము చేయుము. ముహూర్తకాలము దాటకుండుగాక".

ఇట్లు పలికి జనకుడు భరతునితో ఇట్లు పలికెను. "ఓ రఘునందన మాండవియొక్క చేయిని పాణిగ్రహణము చేయుము". పిదప ధర్మాత్ముడైన జనకుడు శతృఘ్నునితో ఇట్లు పలికెను. "ఓ మహాబాహో ! శ్రుతకీర్తి చేతిని పాణిగ్రహణము చేయుము ".
మరల రామలక్ష్మణభరతశతృఘ్నులతో జనకుడు ఇట్లు పలికెను."ఓ కాకుత్‍స్థవంశజులారా ! మీరందరూ సౌమ్యులు మంచి చరిత్ర గలవారు. భార్యలతో సుఖముగా ఉందురుగాక "

వసిష్ఠుని మదిలో నున్న అ జనకుని మాటలను విని నలుగురూ నలుగురు రఘుకుమారులు పాణిగ్రహణము చేసిరి. భార్యలతో కలిసి అగ్నివేదికనూ రాజులనూ ఋషులని ప్రదక్షిణము చేసి విధి పూర్వకముగా వేదములలో చెప్పిన విథముగా వివాహము చేసికొనిరి.

అంతరిక్షమునుండి దివ్యదుందుభులు , గీత వాద్యములు మోగుచుండగా వెలుగుచున్న పుష్పవృష్ఠి కురిశెను. అప్సరసంఘములు నృత్యము చేసిరి. గాంధర్వులు గానము చేసిరి. రఘుముఖ్యుల వివాహము అత్యంత అద్భుతముగా జరిగెను ఈ విథముగా తూర్యాది మంగళ వాద్యములు మోగుచుండగా తేజోమూర్తులైన ఆ దంపతులు మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణము చేసిరి.

పిమ్మట భార్యలతో కలిసి ఆ రఘునందనులు విడిదికి వెళ్ళిరి. ఋషిసంఘములతో బంధువులతో కూడి ఆ దశరథ మహరాజు సీతా ఊర్మిళ మాండవీ , శ్రుతకీర్తులతో కూడిన రామలక్ష్మణభరతశతృఘ్నులను అనందముతో చూచుచూ వారిని అనుసరించెను.

ఈ విథముగా బాలకాండలో డెబ్బది మూడవ సర్గము సమాప్తము ||

|| ఓమ్ తత్ సత్ ||

అథోపకార్యాం జగ్ముస్తే స భార్యా రఘునందనాః |
రాజాప్యనుయయౌ పశ్యన్ సర్షిసంఘస్సబాంధవః ||

"పిమ్మట భార్యలతో కలిసి ఆ రఘునందనులు విడిదికి వెళ్ళిరి. ఋషిసంఘములతో బంధువులతో కూడి ఆ రాజు వారిని చూచుచూ వారిని అనుసరించెను".

|| ఓమ్ తత్ సత్ ||

 


||om tat sat ||